నీటి సంఘాలు :- |
నీటిపారుదల రంగంలో సాగునీటి సంఘాల ఏర్పాటు విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. నీటిపారుదల వ్యవస్థపై రైతులకే అధికారాన్ని, బాధ్యతను అప్పగించిన విశిష్ట, వినూత్న, విప్లవాత్మక ప్రయోగమే సాగునీటి సంఘాల ఏర్పాటు. దేశంలో ఎక్కడా చేపట్టని ఈ ప్రక్రియవల్ల రైతులు తమ వ్యవహారాలను తామే నిర్ణయించుకొనే అవకాశం లభించింది.సాగునీటిని సమర్ధవంతంగా, సమానంగా పంపిణీ చేయడం, నీటిపారుదల వ్యవస్థను పద్ధతి ప్రకారం అభివృద్ధిపరచటం, నిర్వహించటం ఈ వ్యవస్థలోని ప్రయోజనాలు. |
సాగునీటి సంఘాలను ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం 1997 ఏప్రిల్‌లో రైతుల నీటిపారుదల నిర్వహణా చట్టాన్ని తీసుకువచ్చి 1997 జూన్‌లో ఎన్నికలు నిర్వహించింది.ఈ ఎన్నికల్లో 10,292 సాగునీటి సంఘాలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికయ్యాయి. 1997 నవంబరులో జరిగిన ఎన్నికల్లో 173 డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికలు జరిగాయి. సాగునీటి సంఘాలు జూన్ 1997 లో ప్రారంభమయ్యాయి. ప్రపంచ బ్యాంకు సహాయంతో అమలయ్యే ఆర్ధిక పునర్నిర్మాణ ప్రాజెక్టు కింద నీటిపారుదల రంగానికి అత్యధిక మొత్తంలో 1481.58 కోట్ల రూపాయలను సవరించిన అంచనాలతో కేటాయించబడినది. 1998-1999 సంవత్సరంలో నీటి సంఘాలు 21,406 పనులను రూ.118.82 కోట్ల రూపాయలతో పూర్తి చేశాయి. 1999-2000 సంవత్సరంలో సాగునీటి సంఘాలు 17,185 పనులను రూ.139.60 కోట్లతో పూర్తి చేశాయి. 2000-2002 సంవత్స్రరంలో (2 సంలలో) 4948 చిన్న నీటి చెరువులను 225.81 కోట్ల రూపాయలతో కనీస పునరుద్ధరణ చేసేందుకు చేపట్టడం జరిగింది. దీనివలన 5 లక్షల 78 వేల హెక్టార్ల విస్తీర్ణానికి ప్రయోజనం కలుగుతుంది. 2000-2001 సంవత్సరంలో సాగునీటి సంఘాలు 6950 పనులు, 147 చెరువులు మరమ్మత్తు పనులు రూ.105 కోట్లతో పూర్తి చేశాయి.2001-2002 సంవత్సరంలో సాగునీటి సంఘాలు 6,100 పనులు1,144 చెరువుల మరమ్మత్తు పనులు 112.81 కోట్ల రూపాయలతో పూర్తి చేశాయి. 2002-2003 సంవత్సరంలో 820 పనులు1703చెరువుల మరమ్మత్తు పనులు 103.00 కోట్ల రూపాయలతో పూర్తి చేశాయి. నేటి వరకు అనగా 1998-2003 (మార్చి 2003 వరకు)సుమారు 52,500 పనులను,సుమారు రూ.579 కోట్లతో పూర్తి చేసిసి, సుమారు 10.08 లక్షల ఎకరాల చివరి భూములకు సాగునీటిని అందించడం జరిగింది. క్లిష్టమైన పరిస్థితులలో క్రితం సంవత్సరం అనగా 2000-2001 రబీ సీజనులో గోదావరి డెల్టా నీటి సంఘాలు 60 శాతం నీటితో 15 శాతం ఎక్కువ ఉత్పత్తిని సాధించగలిగారు.అదేవిధంగా కిష్ణా డెల్టా నీటి సంఘాలు 2001 ఖరీఫ్ సీజనులో 50 శాతం నీటితో పూర్తి ఆయకట్టును సాగుచేశారు. మరియు 2002 ఖరీఫ్ సీజనులో కూడా కిష్ణా డెల్టాలో నీటి ఎద్దడి పరిస్థితిని సమర్ధ నీటి యాజమన్య పద్ధతులతో అధిగమించారు. సాగునీటి రంగంలో రైతుల పాత్రప్రపంచవ్యాప్తంగా సాగునీటి నిర్వహణ బాధ్యతను రైతులకు అప్పచెప్పడం ద్వారా నీటి వినియోగం సమర్థవంతంగా, సక్రమంగా జరుగుతుందని గుర్తించారు. చాలీచాలని నిధులను రైతు సంఘాలకు అందచేసినా కూడా అవి సాగునీటి వ్యవస్థను మెరుగ్గా కాపాడుకోగలవని అధ్యయనాల ద్వారా తేలింది. కాలువలు బాగుంటేనే తమ ఆర్థిక స్థితి బాగుంటుందని తెలిసిన రైతులు వాటి మరమ్మత్తు, పరిరక్షణ పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటున్నారన్నమాట వాస్తవం. వంద సంవత్సరాలుగా మన దేశంలో అమల్లో ఉన్న నీటి పారుదల చట్టాలను పరిశీలిస్తే వాటిల్లో ఎక్కడా రైతుల భాగస్వామ్యానికి వీలు కల్పించబడలేదు. సాగునీటి పాలనా యంత్రాంగం ఆదినుంచీ సాంకేతిక సిబ్బంది చేతుల్లోనే ఉంది. ఆనాటినుంచి ఈనాటివరకు సాంకేతిక సిబ్బంది రైతులకు దూరంగానే ఉంటూ వచ్చింది. స్వాతంత్య్రం వచ్చాక కొన్ని కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయి. అవి సాగునీటి వ్యవస్థలో రైతుల భాగస్వామ్యాన్ని గుర్తించాయే తప్ప రైతు సంఘాలకు అధికారాలను కానీ, నిధులను కానీ సమకూర్చలేదు. రైతులకు సాగునీటి నిర్వహణ అప్పగిస్తే అది క్రమక్రమంగా క్షీణిస్తుందని చాలా మంది అనుకున్నారు. ఈ భావనకు తోడు ఇంజనీర్లు తమ అధికారాన్ని రైతులకు అప్పగించడానికి ససేమిరా అంగీకరించలేదు. 1873 సంవత్సరంలో అమల్లోకి వచ్చిన ఉత్తర భారత కాలువ, మురుగునీటి చట్టం, 1876లో రూపొందిన బెంగాల్ నీటి పారుదల చట్టం, 1879లో తయారయిన బాంబే నీటి పారుదల చట్టాన్ని పరిశీలిస్తే అవి ఏవి కూడా సాగునీటి నిర్వహణలో రైతుల భాగస్వామ్యానికి అవకాశం కల్పించలేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న నీటి పారుదల చట్టాలను చూసినా మరమ్మతు పనులకు అవసరమైన నిధులను రైతుల సంఘాలకు బదిలీ చేసే అంశం ఎక్కడా కనిపించదు. రైతులు పూర్తిగా సాగునీటి అధికారులపైనే ఆధారపడవలసి వచ్చింది. అధికారాలన్నీ నీటి పారుదల శాఖ చేతుల్లోనే ఉన్నాయి. ఆ శాఖ నిర్ధారించిన ‘కాలువ అధికారి’ (Canal Officer) కి అన్ని అధికారాలను కట్టబెట్టారు. వారు నీటి వినియోగం సక్రమంగా జరగకపోయినా పూచీ వహించవలసిన అవసరం లేదు. రైతులకు సంబంధించిన అన్ని నిర్ణయాలు పై అధికారులు తీసుకోవలసిందే గానీ వారిని సంప్రదించే పద్ధతి లేదు. నీటిపై రైతుల హక్కు బొత్తిగా గుర్తింపబడలేదు. నీటి వినియోగదారులకు శాఖాధికారులు జవాబుదారి కాదు. నీటిని ఎప్పుడూ సరఫరా చేసేది, ఎంత పరిమాణం చేసేది అన్ని నిర్ణయాలు అధికారులే చేస్తూ ఉండటంవల్ల సాగునీటి వ్యవస్థలో ఎలాంటి పారదర్శకత ఉండేది కాదు. ఈనాటికీ చాలా రాష్ట్రాల్లో పరిస్థితి పైన చెప్పినట్టే ఉంది. అయితే అలాగని ఏ రాష్ట్రంలోనూ రైతుల భాగస్వామ్యాన్ని గుర్తించలేదని కాదు. 1931లో అమల్లోకి వచ్చిన మధ్యప్రదేశ్ నీటి పారుదల చట్టం ప్రతి గ్రామంలోనూ సాగునీటి పంచాయితీలు ఏర్పాటు చేయాలని చెప్పింది. అయితే ఈ పంచాయితీపై సర్వాధికారాలు కలెక్టర్‌వే. 1976లో అమల్లోకి వచ్చిన మహారాష్ట్ర సాగునీటి చట్టం ‘నీటి పారుదల నిర్వహణలో భాగస్వామ్యాన్ని’ (Participatory Irrigation Management) సూత్రప్రాయంగా అంగీకరించింది. సాగునీటి అగ్రిమెంట్ల ద్వారా నీటి సంఘాలు నీటిని తమ సభ్యులకు ఘనపు పరిమాణంలో సరఫరా (Volumetric Supply) చేసే పద్ధతి ప్రవేశపెట్టింది. అయితే ఆ నీటి సంఘాలలో సంబంధిత అధికారి కూడా సభ్యుడు కావడం వల్ల నీటి సరఫరాపై సంపూర్ణమైన అధికారం అతని చేతుల్లోనే ఉంది. రైతుల భాగస్వామ్యానికి చక్కని ఉదాహరణ గుజరాత్ రాష్ట్రం. ‘ఉకై కాకరాపార్’ ప్రాజెక్టుల్లో ‘మోహినీ సహకార సంఘం’ చక్కగా పనిచేస్తూ వచ్చింది. అయితే అనేక సంవత్సరాలు సమర్థంగా పనిచేసిన ఆ సంఘం కీలకమైన ఒక వ్యక్తిపై పూర్తిగా ఆధారపడడం మూలాన్నైతేనేం, సంస్థాపరంగా ఎదగక పోవడంవల్ల నైతేనేం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. జూన్ 1975లో ఉత్తర్వు ద్వారా గుజరాత్ ప్రభుత్వం నీటి పారుదల నిర్వహణలో రైతుల భాగస్వామ్యానికి అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాలలో 13 ప్రయోగాత్మక ప్రాజెక్టులను చేపట్టడమే గాక సంఘాలు ఏర్పడటానికి అవసరమయ్యే నమూనా మెమోరాండంను కూడా తయారు చేసింది. కర్నాటకలో రైతుల భాగస్వామ్యం మొట్టమొదటిసారి 1980లో ‘మాలప్రభ’ ఆయకట్టులో ప్రారంభమైంది. 1992 నాటికి 49 వినియోగదారుల సంఘాలు వెలిసాయి. ఈ మధ్య ప్రభుత్వం నీటి వినియోగ సంఘాలకు చట్టబద్ధత కల్పించాలని సంకల్పించినట్టు తెలిసింది. గోవా, కేరళ, హర్యానా, ఒరిస్సా, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ మొదలైన రాష్ట్రాలు కూడా ఎంతో కొంతమేరకు నీటి వినియోగదారుల సంఘాలు ఏర్పడటానికి కృషి చేశాయి. ఈ రాష్ట్రాలన్నీ తమ తమ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న నీటి పారుదల చట్టాలను సవరించి నీటి వినియోగదారుల సంఘాలకు సాగునీటి వ్యవస్థలో భాగస్వామ్యం కల్పించాలని ఉద్దేశించాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమొక్కటే ‘ఆంధ్రప్రదేశ్ రైతుల సాగునీటి నిర్వహణ చట్టాన్ని’ 1997లో రూపొందించి అమలు చేసింది. ఈ చట్టం ప్రకారం రైతుల సంఘాలు మూడంచెలుగా ఉంటాయి. మొదటి స్థాయి-ప్రాథమికస్థాయి(మైనర్ కాలువ స్థాయి)లో సాగునీటి సంఘాలు, రెండవ స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ కమిటీలు పనిచేస్తాయి. మూడవ స్థాయిలో ప్రాజెక్టు కమిటీ ఉంటుంది. సాగునీటి సంఘం తమ పరిధిలో ప్రతీ సాగునీటి సీజన్‌కు అవసరమైన ‘వారబంది’ని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా తయారు చేస్తుంది. దీన్ని సంబంధిత డిస్ట్రిబ్యూటరీ కమిటీ లేదా ప్రాజెక్టు కమిటీ ఆమోదించవలసి ఉంటుంది. ‘వారబంది’ ప్లాన్ అనుసరించి నీటి పంపిణీ సక్రమంగా జరిపే బాధ్యత ఈ సంఘానిదే. అలాగే సాగునీటి వ్యవస్థ నిర్వహణ బాధ్యత కూడా ఈ సంఘానిదే. భూస్వాముల నుండి నీటి తీరువా వసూలు చేసే పనిలో రెవెన్యూ అధికారులకు సహాయం కూడా చేయవలసి ఉంటుంది. నీటి వినియోగదారుల సంస్థ పనిపై డిస్ట్రిబ్యూటరీ కమిటీ, డిస్ట్రిబ్యూటరీ కమిటీలపై ప్రాజెక్టు కమిటీ అజమాయిషీ చేస్తాయి. నీటి వినియోగం సమర్థంగా, సక్రమంగా చూడటం, నీటిని వృధాగా పోనివ్వకుండా చూడటం, ఎక్కువ దిగుబడి వచ్చేందుకు తోడ్పడటం, సాగునీటి వ్యవస్థ తమదే అన్న భావన ఏర్పడడానికి దోహదం చేయటం ఈ రైతు సంఘాల ప్రధాన లక్ష్యం. మన రాష్ట్రంలో ఈ చట్టాన్ననుసరించి 10,292 సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరిగాయి. అలాగే భారీ ప్రాజెక్టులకు సంబంధించిన 172 డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు కూడా ఎన్నికలు జరిగాయి. నీటి వినియోగదారుల మధ్య ఏర్పడే తగాదాలను కూడా ఈ సంఘాలే పరిష్కరిస్తాయి. నీటి తీరువాను విధించి, వసూలు చేసే అధికారాలను ఈ సంఘాలకు ప్రస్తుతం అప్పగించకపోయినా, అలా అప్పగించే వీలుని చట్టం కల్పిస్తోంది. సాగునీటి సంఘాలకు ప్రభుత్వం హెక్టారుకు రూ.500ల చొప్పున ఏకమొత్తం గ్రాంటు ఇస్తుంది. అదనంగా ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో కొంత భాగాన్ని సంఘాలకు ఇస్తోంది. ఆయకట్టు అభివృద్ధి పనులను, ఇంకా ఇతర అభివృద్ధి కార్యాలను ప్రభుత్వం మామూలు పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించకుండా సాగునీటి సంఘాలకు కేటాయించింది. సాగునీటి సంఘాలు ఏర్పడ్డాక, అవి పనిచేసే తీరుతెన్నులు, లోటుపాట్లు తెలుసుకోవడానికి రాయలసీమ ప్రాంతంలో సుమారు 150 మంది సాగునీటి సంఘాల అధ్యక్షులను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నట్టు, సాగునీటి సంఘాలు తమ బాధ్యతలను సక్రమంగా అర్థం చేసుకుని నిర్వహిస్తున్నాయని రిపోర్టు వెల్లడించింది. ఏది ఏమైనా మరికొంతకాలం గడిస్తే గానీ సాగునీటి సంఘాల పనితీరు వారు ఎదుర్కొనే సమస్యలు బహిర్గతం కావు. ఒకటిమాత్రం నిజం- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన ఈ ప్రయోగం భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా ప్రాచుర్యం పొందింది. |
సాగునీటి సంఘాలు
Subscribe to:
Posts (Atom)